శతచ్ఛంద గణాధిపమ్
శతచ్ఛంద గణాధిపమ్
అభినవశుకపండిత, సమన్వయ సార్వభౌమ,
బ్రహ్మశ్రీ గౌరీభట్ల బాలముకుందశర్మ,
గోలోకాశ్రమము, సిద్ధిపేట గారి
నిత్యావధానములో శతఛందస్సులో గణపతి శతకము...
1) విళంబి-పుష్య-కృష్ణ"ఏకాదశి, గురువారము
తేది 31-01-2019
ఛందము: కందము
జైవిఘ్నేశ్వర భగవా
నే విఘ్నములజ్ఞజనులనేమనకుండన్
గావంగా గతినీవే
నోవిజ్ఞ గుణజ్ఞ యజ్ఞ! ఓం ప్రథమేశా!
2) ఛందము: పథ్యాకందము - కందమువలె.. 6వగణము నలము, 8వ గణము ఒక గురువు.
సుముఖ శుభద వర జయగుణ
సమహృద్గిరిజాకర కల జనితాశా
క్రమ విఘ్నవినాశ గణప
తివధానమునను నిలుపగ ధీ ప్రణతుల్
3. ఛందము: చపలాకందము-
కందము వలె, 4వ గణం జగణము
శుభమస్తు పృచ్ఛకాళికి
సభాస్య సవివర సమేత సజ్జనులకు మీ
యభయముతో గణపతి, దే
వ!భృత్యుఁగావుమవధాన వాగ్విధిని నతుల్
4. ఛందము: విపులాకందము-
కందమువలె, 3, 4 గణాలు అవిభక్త పదాలు
శత పద్యాత్మక ముక్తక
మతి సుందరము సరళము మాన్యకృతాంతః
స్థితకమనీయ విభాస్వ
న్మతులిల వ్రాయంగనెంౘనాదర సమమున్
5) విళంబి-పుష్య-అమావాస్య, సోమవారము
తేది 04-02-2109
ఛందము: *నాగరము* (భరవ)
ప్రాస - యతి ×
శ్రీగణపేశ! వందనమ్
వాగమృతేశి! సన్ముదా
ప్రాగవధాన సాహితీ
భోగమొసంగ వేడెదన్
6) విళంబి-మాఘం-శుద్ద పాడ్యమి, మంగళవారము
తేది 05-02-2109
ఛందము: చిత్రపదము (భభగగ)
ప్రాస √ - యతి ×
సిద్ధివినాయక పాహీ
ఋద్ధి గణాధిప దేహీ |
విద్ధి వధాన సువిద్యా
తద్ధితమేవ నమో మే ||
7)
విళంబి-మాఘ-శు"విదియ, బుధవారము (6-2-2019)
ప్రార్థనా --
ఛందము : *నారాచము* (తరవ)
ప్రాస √ -- యతి ×
విఘ్నేశ్వరా! కృపాళువై
విఘ్నప్రభావనమ్ములన్
నిఘ్నమ్మొనర్చుమయ్య ర
క్షోఘ్నావధాన కార్యమున్
8)
శ్రీ విళంబి-మాఘ-శు"తదియ,
7-2-2019, గురువారము.
ప్రార్థనా --
ఛందము: *విమానము* జతగగ
ప్రాస √ - యతి ×
గణేశ నీపాదమందున్
ప్రణామమర్పింతు దేవా
వధాన సాహిత్య సమ్మే
ళనమ్మునన్ గావుమయ్యా!
9)
శ్రీ విళంబి మాఘ శు" తృ/చ,
8-2-2019, శుక్రవారము.
ఛందము: *సింహరేఖ* రజగగ
ప్రాస √ - యతి ×
శ్రీగణేశ తుండ వక్త్రా
భోగదైకదంత మూర్తే!
రాగవాగమేయ మేస్యుః
ప్రాగుమామనోజ్ఞ వందే ||
10)
శ్రీ విళంబి మాఘ శుద్ధ" చ/పం.
9-2-2019, శనివారము.
ఛందము: *బృహతీ/ఉత్సుకము*
ప్రాస √ -- యతి × -- *భభర*
తుండముఖా! యవధానమం
దుండెడి చిత్తమొసంగు మా
యండగ నీవను భావమే
నిండుగనుండె వినాయకా!
11)
శ్రీ త్య్రవిళంబి మాఘ శు" పంచమి,
10-2-2019, ఆదివారము.
ఛందము: *భుజంగ శిశురుతము* (ననయ)
ప్రాస √ -- యతి ×
గణపయ కనికరమ్మున్
గుణగణమితులుఁదేలన్
కిణికిణి నుడుగులల్లన్
వి.ణ.మొసగను నమస్తే
12)
శ్రీ విళంబి మాఘ శు"షష్ఠి,
11-2-2019, సోమవారము.
ఛందము; *భద్రకము* (రనర)
ప్రాస √ -- యతి ×
శ్రీ గణేశ్వర ముదాకరా
యోగదాయక వధానమం
దేగతుల్ గనగఁజేయుమా
రాగరంజితులు పృచ్ఛకుల్
13) శ్రీ విళంబి మాఘ శుద్ధ సప్తమి,
బుధవారము, 12-2-2019.
ఛందము: *హలముఖి* (రనస)
ప్రాస √ -- యతి ×
విఘ్ననాయక కవివరా
పఘ్నకారక శుభద రా
క్షోఘ్నదాయక కవన ల
క్ష్యోఘ్నినీయగ ప్రణతులున్
14)
శ్రీ విళంబి మాఘ శుద్ధ అష్టమి,
బుధవారము, 13-2-2019.
ఛందము: *రసాలి* (రనరగ)
ప్రాస - యతి 1-7
విశ్వ వంద్య సమవీతమౌ నా
నాశ్వ వేగ యువనావధానా
నశ్వరానుగ వినాశబుద్ధుల్
శాశ్వతమ్ముగ నిసారమౌ వి
జ్ఞాశ్వ విఘ్న నగజాత నౌమీ
15) శ్రీ విళంబి మాఘ శుద్ధ నవమి,
గురువారము, తేది 14-02-2109
ఛందము: *శుద్ధవిరాటి*
(మసజగ)
ప్రాస √ - యతి 1-6
మూలాధార విముక్త రూప స
ల్లీలాకార విలేప సావధా
నాలేపార్తిహరా! ముదాకరే
ణాలోక్యామృత నాథ దేహిమే
16) శ్రీ విళంబి మాఘ శుద్ధ ఏకాదశి,
శుక్రవారము, తేది 15-02-2109
ఛందము: *భోగివిలసితము* భసజగ
ప్రాస √ - యతి 1-7
సైనికులనుఁౙూసి కంటగిం
పా! నిట నటరాట్ప్రభో•ప మృ
త్యౌ నిరుపమ బాధనిత్తువా
శ్రీ నగజనితాళిఁగావుమా
17) శ్రీ విళంబి మాఘ శుద్ధ ద్వాదశి,
శనివారము, తేది 16-02-2109
ఛందము: *శరషట్పదీ*
మాత్రలు - 8-8-14.
ఋద్ధిగణావృత
సిద్ధి వినాయక
శుద్ధ వరానన సుందర వా
గ్యుద్ధ వధానము
విద్ధిగఁ దలపగ
నిద్ధరసాధనమీయ నతుల్
18) శ్రీ విళంబి మాఘ శుద్ధ త్రయోదశి,
తేది 17-02-2109
ఛందము:. *మనోరమ* (నరజగ)
ప్రాస √ - యతి 1-7.
గణపతే! నమో నమో•స్తు వా
రణముఖాభయం విధేహి పూ
రణ గణావధార సంపదా
గుణ విశోభనం కురు ప్రభో!
19) శ్రీ విళంబి మాఘ శుద్ధ చతుర్దశి,
సోమవారము
తేది 18-02-2109
ఛందము: *మయూరసారి* (రజరగ)
ప్రాస √ - యతి 1-7.
వక్రతుండ వక్త్రభాసితా ని
ర్వక్ర నాగసూత్ర బంధితా స
మ్యక్రమావధాన యాజ్ఞికోప
ప్రక్రియానుకంప లాస్యమేవమ్ ||
20) శ్రీ విళంబి మాఘ శుద్ధ చతుర్దశి,
మంగళవారము
తేది 19-02-2109
ఛందము: *చంపకమాలి* (భమసగ)
ప్రాస √ :: యతి 1-7.
శ్రీగణపా వాణీశి మహేశీ
వాగవధానప్రాభవ రూపై
ర్యోగ విలాసజ్ఞోద్యుగ పద్య
ప్రాగను కావ్యాలాప! వవందే ||
21) శ్రీ విళంబి మాఘ బహుళ పాడ్యమి
తేది 20-02-2109
ఛందము: *వేగవతి* (సససగ)
ప్రాస √ - యతి 1-7
సుఖదావరదాశుభదాగణపా స
న్ముఖహస్తినిభాముదమారవధానే |
శిఖివాహనభూషిత వాణి చిరం మే
ప్రఖురాట్టనదం ప్రవిలాపయ వందే ||
22) శ్రీ విళంబి మాఘ బహుళ తదియ,
గురువారము
తేది 21-02-2109
ఛందము : *పణవము* (మనయగ)
ప్రాస √ - యతి 1-6.
శ్రీ విఘ్నేశ్వరసితజాస్యా భా
వే వాంఛా ఫల విశదంమే సా |
శ్రీవాణ్యేక వశిద వాఙ్నందా
ప్రావీణ్యాప్తిమవధి దేహి స్తౌ |
23) శ్రీ విళంబి మాఘ బహుళ చవితి,
22-2-2019, శుక్రవారము.
ప్రార్థనా -- 🔔
ఛందము : *కౌముది* (నతతగ),
ప్రాస √ -- యతి 1-6.
నినుమనమ్మున్ననేకాద్య పూ
జనుఁగొనంగా జయమ్మీయగా
వినతినేఁజెప్పినన్విందువా
ఘన గణేశా గనన్ వేడెదన్
24) శ్రీ విళంబి మాఘ బహుళ పంచమి,
శనివారము
తేది 23-02-2109
ఛందము: *రుక్మవతి* (భమసగ)
ప్రాస √ -- యతి 1-6.
నౌమిగణేశా నందగజాస్యా
సామగ రాగోజ్జాగృత లీలా
ధీమ వధానాధీకృత! సుష్టు
ప్రేమ వరంమే•భీష్ట ఫలాప్త్యై ||
25) శ్రీ విళంబి మాఘ బహుళ షష్ఠి,
ఆదివారము
తేది 24-02-2109
ఛందము: *పంక్తి* (భభభగ)
ప్రాస √ -- యతి. 1-7
మూషిక వాహన మోదక హ
స్తోష సవర్ణ కచో తిలకో
ద్వేష వరాస్య! సుభిక్ష వర
మ్మేష సభిక్షుకమేహి నమః ||
26) శ్రీ విళంబి మాఘ బహుళ సప్తమి,
సోమవారము
తేది 25-02-2109
ఛందము: *మణిరంగము* (రససగ)
ప్రాస √ -- యతి 1-6.
శ్రీకరాకర లీలవిహారా
ధీకులాన్వయ దేహి వరం మే |
వ్యాకరీ ముఖ భాసగణేశా
ధీకరోత్యనతిమ్మవధానమ్ ||
27) శ్రీ విళంబి మాఘ బహుళ అష్టమి,
మంగళవారము
తేది 26-02-2109
ఛందము: *మత్త* (మభసగ)
ప్రాస √ -- యతి 1-7.
శ్రీవిఘ్నేశో•స్తికజిజిగీషా
మా వాణీ వాగ్వర మహితాప్తా
వేవం భౌమే సది విదధీ మా
మేవప్రాచీ కళమిళితాశీః ||
28) శ్రీ విళంబి మాఘ బహుళ నవమి,
బుధవారము
తేది 27-02-2109
ఛందము: *త్రిష్టుప్* /వనజ (నరరవ)
ప్రాస √ -- యతి 1-7.
జయ గణాధిపా శాంత సన్ముఖో
ద్వయముపాస్మహే వారణాస్య మా
నయ కుధీమియంనైవవిఘ్న మే
స్మయవధాన వాక్చాతురీ ప్రదా ||
29) శ్రీ విళంబి మాఘ బహుళ నవమి/దశమి,
గురువారము,
తేది 28-02-2109
ఛందము: *పృథ్వీ* (ననజవ)
ప్రాస √ -- యతి. 1-8
ప్రథమ గదిత విరాజసమా
కథన వదన నగాత్మ సుత
ప్రథిత గణప సభాంగ వధా
న విజయముపయ నౌమి విభో ||
30) శ్రీ విళంబి మాఘ బహుళ దశమి/ఏకాదశి, శుక్రవారము.
తేది 01-03-2109
ఛందము: *వృంత* (ననసగగ)
ప్రాస √ --. యతి 1-9.
జయగణపతి వరశాస్త్రాక్ష
ప్రయతన కట ముచి రంగేశా|
నయపథమనఘ గణానందా
జయవిజయద యవధానే నౌ ||
31) శ్రీ విళంబి మాఘ బహుళ ఏకాదశి, శనివారము.
తేది 02-03-2109
ఛందము: *రథోద్ధతము* (రనరవ)
ప్రాస √. -- యతి 1-7.
శ్రీవినాయక విశేష భావనా
భావి భావిత సభా వచోమృత
మ్మే•వధాన సది మే•నుకంపయా
శీ విశేష్య వరశేముషి ప్రభో ||
32) శ్రీ విళంబి మాఘ బహుళ త్రయోదశి, ఆదివారము.
తేది 03-03-2109
ఛందము : *కలితాంతము/కాంతి* (తజజవ) ప్రాస√ యతి 1-8
శ్రీ తుండ వరాస్య విశిష్ట ముఖో
ద్గీతాప్త వరాస్యమధీనకర
ప్రోతాభిద సత్కృత రోచితమే•
భీతానవధానమభీష్ట వరమ్ ||
33) శ్రీ విళంబి మాఘ బహుళ చతుర్దశి, సోమవారము.
తేది 04-03-2109
ఛందము: *మాత్రా ఛందస్సు*
హరహరహర మహదేవ ఉమాపతే
గౌరీశంకర శంభో!
జయ పార్వతి రమణ ప్రభో ప్రమధాధిప
భక్త శుభంకర సాంబా!
వృషభారూభ శివా తవదాస్యం దిశ పూర్ణ దయాంబునిధే!
అభిషేకప్రియ భావా!
అభిమానప్రియ శర్వా!
అభివంద్య చరణ విభవా!
హిమనగజా తనుభాగ విరాజిత
అద్వైతామృత మూర్తే!
గిరిశా! గిరిశా! గిరిశా!
శివ భవ జగదీశా...!
34) శ్రీ విళంబి మాఘ బహుళ చతుర్దశి/ అమావాస్య, మంగళవారం
తేది 05-03-2109
ఛందము: *చంద్రికా* (ననరవ)
ప్రాస √ యతి. 1-9
కరివదన వరాంగ కంజనే
త్ర రిపుహర వధాన ధన్య వా
గ్వరమధిక సభానుభావనమ్
చిరముపయ నమో విశేషదా ||
35) శ్రీ విళంబి మాఘ బహుళ అమావాస్య, బుధవారము.
తేది 06-03-2109
ఛందము: *శిఖండివిరుతము* (జసతగగ)
ప్రాస √ -- యతి 1-7
గణాధిప వరంగా భక్తితో స
ద్గుణమ్ములొసగన్ కోరేను దీనుం
డణోరవళి తంటాలన్నణంచన్
ప్రణామములఁగే లర్పింతు దేవా ||
36) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి, గురువారము.
తేది 07-03-2109
ఛందము :
ప్రాకారబంధము/మందారదామము
ప్రాస √ యతి 1-7.
విఘ్నేశపఘ్నాంత నిఘ్నాప్త వందే
అఘ్నాధివాసోపహారప్రభాస్యా |
గోఘ్నాంతకానేక జఘ్నేశ పాహి
స్రుఘ్నిప్రభాస్త్ర్యఘ్న స్రుఘ్నిప్రదస్త్వమ్ ||
37) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ విదియ, శుక్రవారము.
తేది 08-03-2109
ఛందము: *మౌక్తికమాల* (భతనగగ)
ప్రాస √ -- యతి 1-7.
శ్రీగిరిజా మాత శివసతీ వా
గ్యోగవిధాన ప్రగుణ వరం మే |
పూగఫలాప్తిన్వపుధృత విఘ్నే
డ్యోగ గణేశా పటుతర మేహి ||
38) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ తదియ, శనివారము.
తేది 09-03-2109
ఛందము: *వాతోర్మి* (మభతవ)
ప్రాస √ --- యతి 1-7.
నాచేనేమైనఁగనాసంగతమౌ
వాచిప్రావాక్కపవాదక్రియలన్
నీచేభాసింౘగ నీవేకరుణన్
దాౘన్నేలాయవధానమ్మనగన్
39) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ చతుర్థి, ఆదివారము.
తేది 10-03-2109
ఛందము: *శాలిని (మతతగగ)
ప్రాస √. -- యతి 1-7.
శ్రీమత్కారుణ్యాప్త సింధోగజాస్యా
ప్రేమప్రాయోపాయ రేఖాతటేర్నః |
శ్యామా వీణాపాణి సారస్వతీ దృ
గ్ధామందేహీ నిత్యధన్యావధానే ||
40) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ పంచమి, సోమవారము.
తేది 11-03-2109
ఛందము: *పాదపము*(భభభగగ)
ప్రాస √. యతి 1-7.
శంకర శంకర శంకర వందే
సంకటనాశ వశంకర నౌమి |
కింకరవాణి ముఖే యవధాన
మ్మంకుర వాగ్బల మాన్య! విధేహి||
41) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ సప్తమి, బుధవారము. తేది 12-03-2109
ఛందము: *శ్రీరమణము*
1వ- మసజగ యతి 1-6
2వ- భభభగగ యతి 1-7
ప్రాస √.
******************
బాలాలోల కళాముకుంద స
ల్లాలితలోకసులక్షణధౌరీ!
కాలపులీలలుఁగాంచెడుశర్మా!
లీలవధానములేగదశౌరీ!
వేలస్వానుగతానుకంప వి
త్ఫాలసుభస్మపు పండితవాణీ!
యేలుము మమ్ములనేమరకుండా!
శీలశిఖామణి సేవనకారీ!
42) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ సప్తమి, బుధవారము.
తేది 13-03-2109
ఛందము: *శ్యేని* (రజరవ)
ప్రాస √ -- యతి 1-7.
మోదకప్రియ ప్రమోద భక్షకమ్
స్వాదు సత్కపిత్థ సార సంగ్రహమ్ |
శ్రీద వాగ్విలాస చిత్త దాయకమ్
వేదరూప నౌమి విఘ్న నాయకమ్ ||
43) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ అష్టమి, గురువారము.
తేది 14-03-2109
ఛందము : *చౌపథము* (తతతహ)
ప్రాస √. -- యతి 1-7
ప్రారంభ పూజ్యప్రభావాప్త దేవ
కారుణ్య వారాశి గండాంతకాప్త |
స్మేరావధానే విచిత్రానుకంప
ధారాధరాధార ధన్యోస్మి నౌమి ||
44) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ నవమి, శుక్రవారము.
తేది 15-03-2109
ఛందము: *ఉపస్థితము* (తజజగగ)
ప్రాస √. -- యతి. 1-8.
పర్వోన్ముకుళీ కరవాణి వీణా
సర్వోన్మధు వాగ్విధి జాత వేణీ |
దర్వీ కృపయాశు విధం విదేహ్య
ద్యర్వాగమితాన్యవధాన కార్యే ||
45) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ దశమి,
16-3-2019, శనివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *స్వాగతము* (రనభగగ)
ప్రాస √. యతి 1-7
పార్వతీ తనయ పంకజనేత్రా
సర్వసంకట విషాంత గణేశా |
శర్వరీ తిమిర సంధ్య సుపూజ్యా
శీర్వధాన సదసి క్రమ వందే ||
46) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి,
17-3-2019, ఆదివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *ఏకరూప* (మభజగగ)
ప్రాస √ యతి 1-8
సద్యోదీక్షాప్రద వశాంకురాశా
విద్యోత్సాహప్రతి కవిత్వ భాషా |
విద్యాశీర్భిర్విధి సుభిక్షమేనమ్
హృద్యస్విద్యానుగ సహేతునా దీ ||
47) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి,
18-3-2019, సోమవారము.
ప్రార్థనా -- 🔔
ఛందము: *భ్రమరవిలసితము* (మభనవ)
ప్రాస √. యతి 1-6.
గౌరీపుత్రాక్ష గజవదన సాం
బారుద్ధ్యుద్ధే నవ గుణ భసిత |
ప్రారంభే పూజ్య లవకరుణయా
ధీరాధానంత్వతిశయ జయ భో ||
48) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి,
19-3-2019, మంగళవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *ఇంద్రవజ్ర* (తతజగగ)
ప్రాస √. యతి 1-8
శ్రీవాగ్విలాసం లవలీకృపాళుమ్
భావానుసంధాన విభాసితాస్యమ్ |
ప్రావారణా వారణపంక్తి దంతమ్
శ్రీ విఘ్ననాథం శిరసి ప్రవందే ||
49) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి,
20-3-2019, బుధవారము.
ప్రార్థనా -- 🔔
ఛందము: *ఉపేంద్రవజ్ర* (జతజగగ)
ప్రాస √. యతి 1-8.
దయానిధీ మోదకధన్యభాస
స్మయోక్త తుండాస్య సుమంగళాశీ
ర్నయావధానే•ద్య గణాధిపాఢ్యా
జయమ్మునీయంగ విచారమేలా ||
50) శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి,
21-3-2019, గురువారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *ఉపజాతి*
1-3తతజగగ, 2-4జతజగగ
ప్రాస √. యతి 1-8.
జ్ఞాన ప్రధాత్రీ సువిశాలనేత్రీ
శుచిస్మితా రమ్య వచోవిధాత్రీ |
శ్రీ వ్యాస నారాయణ శేముషీ భా
స్కరావధానే ప్రవికాస! వందే ||
51) శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ పాడ్యమి,
22-3-2019, శుక్రవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *సమోపజాతి*
1,2 తతజగగ ; 3,4జతజగగ
ప్రాస √. యతి -- 1-8.
వాణీముఖాంబోజ విభాస్కరా శ్రీ
పాణీయుగాభీతిద వాంఛితాప్త |
ప్రణాధికచ్ఛంద విరాజ మాన్యా
క్షణావధానే వద చిత్కళాభా ||
52) శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ తదియ,
23-3-2019, శనివారము.
ప్రార్థనా -- 🔔
ఛందము: *వ్యత్యస్తమోపజాతి*
1,2 జతజగగ ; 3,4 తతజగగ
ప్రాస √. - యతి 1-8.
గజాననం దివ్య యుగాబ్జ పద్మమ్
ప్రజాళి విఘ్నాంత విలాసితేశమ్ |
రాజీవపత్రేక్షణ రౌప్య సూత్రమ్
తేజోమయం నౌమి సుధీ•వధానే ||
53)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ చతుర్థి,
24-3-2019, ఆదివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *వ్త్యస్తోపజాతి*
1,3 జతజగగ ; 2,4 తతజగగ
ప్రాస √. యతి 1-8.
అనాదివిఘ్నాంతకమాద్య పూజ్యమ్
వైనాయకప్రాభవ భాసమానమ్ |
సనాతనం లోక విచార నాశమ్
వధానరూపాస్తిక వాగ్మినం నౌ ||
54)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ పంచమి,
25-3-2019, సోమవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *వైపరీత్యోపజాతి
1,3 తతజగగ ; 2,4 జతజగగ
ప్రాస √ యతి 1-8
వేణీస్వరూపాయ కవీశ్వరాయ
ప్రణోకృతీతుండ విభాస కాయ |
ప్రాణాంతకాటంక నివారకాయ
గణాధిపా! నౌమి జగావధానే ||
55)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ షష్ఠి,
26-3-2019, మంగళవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *వారాంగి*
1. తతజగగ ; 2.జతజగగ ;
3. తజజవ ; 4. మభతవ.
ప్రాస √ - యతి 1-8, 4వ పా..1-7
వైనాయకీ భక్తి విభాసకత్వాత్
మనో•వధానే వినిమగ్నమేవమ్ |
నూనం సుధ సీమ్ని తనోతు ఫలమ్
దీనానామాద్య కృతీవందనముల్ ||
56)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ సప్తమి,
27-3-2019, బుధవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము; *నారీనుతము*
1,3-మతతగగ యతి 1-7
1,4-తతజగగ యతి 1-8.
ప్రాస √.
గౌరీపుత్రానంద కంజాయతాక్షా
ఘోరాగ్ని మాయాంతక కోవిదాంత
శ్చోరగ్రస్తం ప్రాయశో•జ్ఞం ప్రపన్నమ్
ధారావధానే వరదాప్రపాహీ ||
57)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ అష్టమి,
28-3-2019, గురువారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము : *స్రగ్విణి* (రరరర)
ప్రాస √ యతి 1-7.
శ్రీగణేశార్చనే చింతయామ్యేతదే
వాగజానందనం వారిజాక్షార్చితమ్ |
పూగవాగీశ్వరం పూర్ణచంద్రావధా
నాగమాయోగినం నౌమిశీఘ్రం ముదా ||
58)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ నవమి,
29-3-2019, శుక్రవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము : *మేఘవిలసితము*
(మననస), ప్రాస √ యతి 1-6.
గౌరీశంకర కరుణద పరమో
దారానంద సదయ గజవదనా |
ధారాచక్ర జిత కులపథగ ధ
ర్మాధారాస్తిక మనసి వస ముదా ||
59)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ దశమి,
30-3-2019, శనివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *నవవిలసితము/కలహంస* (నజభయ)
ప్రాస √ యతి 1-8.
వరయ వరాశ్రితాభయ వరాస్యా
కర సుకరాకరాగమ విధాఢ్యా |
దర దరహాస సుందర వరేణ్యా
స్మర నరభక్త భాసద నమస్తే ||
60)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ ఏకాదశి,
31-3-2019, ఆదివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *పదమాలి* (నజజర)
ప్రాస √. యతి 1-10.
అఖువహ హస్తిముఖాదరార్చితా
శిఖివహ సోదర సాంబుజేక్షణా |
ప్రఖర వధాన సుపక్వ భావనా
సుఖతరమాశు విధౌవిశోధయా ||
61)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ ద్వాదశి,
1-4-2019, సోమవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *లలిత* (తభజర)
ప్రాస √. యతి 1-9.
ఋద్ధిప్రధాన గుణపాహి విఘ్నపా
బుద్ధి ప్రదాయక సభాపురోహితా |
సిద్ధిక్రమానుగ వరం జిగీషయా
వృద్ధిం విధేహి యవధానృపేక్షణా ||
62)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ ద్వా/త్రయోదశి
2-4-2019, మంగళవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *ఉజ్వల* (ననభర)
ప్రాస √ -- యతి 1-8.
కరిముఖ వరదా గణనాయకా
వరగుణకర భావ విధాయకా |
సరసిజ దరహాస మనోహరా
ధర వరయ వరం త్వధునా హి భో ||
63)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ త్రయోదశి
3-4-2019, బుధవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *భుజంగప్రయాతము* (యయయయ)
ప్రాస √. యతి 1-8.
యథా విప్ర కవ్యాత్మనా• సావధానే
తథాబాలమౌకుంద ధారావధానే |
త్రిషష్ట్యుత్సవ ప్రాగ్భళీ, విఘ్ననాథా!
వచస్తే వరస్తే శిరస్థే నమస్తే ||
64)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ చతుర్దశి,
4-4-2019, గురువారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము : *వంశస్థ* {జతజర}
ప్రాస √. యతి. 1-8.
సనాతనాద్యంత విచారణీయ హృ
త్పునాతు సంసార యథోచితాక్రియా|
ధునా•వధానే విబుధోరధీధితా
ప్రణామ హేరంబ! సువాక్ప్రసిద్ధయే ||
65)
శ్రీ విళంబి ఫాల్గుణ కృష్ణ అమావాస్య,
5-4-2019, శుక్రవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము : *ఇంద్రవంశము* (తతజర)
ప్రాస √. యతి 1-8.
గౌరీసుతానంద యుగాస్య శ్రీ విళం
బీరాత్ర సంధ్యాంత సుభిక్షదాయకా |
స్మేరావధానాంతర చిత్ర ధారణే
ధీరోద్ధరా! పాహి సుధీ విలాసినమ్ ||
66)
శ్రీ వికారి చైత్ర శుద్ధ పాడ్యమి,
6-4-2019, శనివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *వసంతతిలక*(తభజజగగ)
ప్రాస √. యతి 1-8.
కాలస్వరూప కలికల్మషకాంత హేరం
బా! లక్షణేక్షణ సభావిజయావధానే |
లీలాకరాప్త లవలీ సవికారి నామ్నీ
కాలోపవత్సర జగత్ప్రభు నౌమి నిత్యమ్ ||
67)
శ్రీ వికారి చై త్రశుద్ధ విదియ,
7-4-2019, ఆదివారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *విశ్వదేవి* (యయయయ)
ప్రాస √ యతి 1-8.
అణోరాది మధ్యాంతకాధ్యాత్మరూప
క్షణేలక్షణేవీక్ష్యసచ్ఛాంతి కర్తా |
ప్రణామే~ద్యసాష్టాంగలాస్యంసభక్త్యా
గణేశావధానే జగన్నాథ పాహీ ||
68)
శ్రీ వికారి చైత్ర శుద్ధ తృతీయ,
8-4-2019, సోమవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము : *తోటకము* (సససస)
ప్రాస √. యతి. 1-9.
అగజావరపుత్ర దయాకర ధీ
నగవాసశివాకరణాద్ద్విముఖా |
తిగళాసతి ఋద్ధి చ బుద్ధి సమే
త శివంకరసంకటదాంత నమః ||
69)
శ్రీ వికారి చైత్ర శుద్ధ చతుర్థి,
9-4-2019, మంగళవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: తోయదము *నజజయ*
ప్రాస √. యతి. 1-8.
సమధిగత ప్రవిచార గణాధీ
న మనుజ సంకటనాశ గణేశా |
భ్రమరవిలాప విపాక సమాధ్వీ
తమ వరయాశు వధాన కవిత్వే ||
70)
శ్రీ వికారి చైత్ర శుద్ధ పంచమి,
10-4-2019, బుధవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: జలోద్ధతిగతి (జసజస)
ప్రాస √. యతి 1-8.
మనోగత సుధా సమాదర మహేం
ధనేవ జడధీ కృతాంతక విభో |
గణేశ! ధృత పన్నగానల శివ
స్తనాశిత వధాన ధారణ నమః ||
71)
శ్రీ వికారి చైత్ర శుద్ధ షష్ఠి, గురువారము, 11-4-2019.
ప్రార్థనా ---- 🔔
ఛందము: పదమాలి (నజజర)
ప్రాస √. యతి 1-10.
ప్రథమ సుపూజ్య సుధీవిభాస వా
క్ప్రథిత విధాయక కంజ కర్ణ స |
త్కథన వధాన విరాజకౌజసో
న్మథన వినాశ కరా ప్రణామహే ||
72)
శ్రీ వికారి చైత్ర శుద్ధ సప్తమి,
12-4-2019, శుక్రవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *ఉజ్వల* (ననభర)
ప్రాస √. యతి 1-8.
జయతు జయ గణేశ! సుధాకరా
నయ వరవరదా! నగజాసుత |
ప్రయతన విజయం భవ మేధునా
సుహృదగణవదాశు సభాంగణే ||
73)
శ్రీ వికారి చైత్ర శుద్ధ సప్తమి/అష్టమి,
13-4-2019, శనివారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *కౌశిక*(నజజజజజర)
ప్రాస √ యతి. 1-14.
ఆనుపమ వాగ్విదితాఖిలవంద్య సమాదరణీయ విఘ్నపా
ధనుకర చండ పరాక్రమ దండ సుధామృదునీల రామ! సౌ
మ్య నవ వధూ సుమకోమల కోమలి మాన్య సుధీమ జానకీ
ప్రణయవివాహ మహోత్సవ కార్య విలాసమునంజలించెదన్
74)
శ్రీ వికారి చైత్ర శుద్ధ దశమి,
14-4-2019, ఆదివారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *ముద్రిక* 1-రసగగ, 2-యసలగ, 3-రసగగ, 4-రసలగ.
ప్రాస √. యతి 1-5.
స్మార విఘ్నశమాంత శ్రీ
కరైర్వాగ్యుగదాయక |
స్మేర పద్య శివాపుత్రో
ద్ధారయాద్యతనా విధౌ ||
నేడు శ్రీరామచంద్రప్రభువునకు పట్టాభిషేకము జరిగి *రాజముద్రిక* అలంకరింపజేయబడిన శుభదినము. కావున, ముద్రిక చ్ఛందములో ప్రార్థన.
75)
శ్రీ వికారి చైత్ర శుద్ధ ఏకాదశి,
15-4-2019, సోమవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *మానిని* (భభభభభభభగ)
ప్రాస √. యతి 1-13
ధర్మనిబద్ధ సుధాపరిపూత
విధాన నిధాన మహాగణపా !
కర్మ విపాకవళీక మృదాకర కార్ముక శస్త్రస దాశరథీ !
మర్మ మనోగత వర్త్మ కళామయి మైథిలి మాన్య వరేణ్య సుధీ !
శర్మగతిర్విదితాంగవధాన విచార శుభేప్సితుడన్నతముల్
76)
శ్రీ వికారి చైత్ర శుద్ధ ద్వాదశి,
16-4-2019, మంగళవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *విభూతి* (రజగ),
ప్రాస √. యతి ×
ఏకదంత వక్త్రతుం
డైకదావధాన చిం
తాకథా మృదూక్తినా
స్తోకధారణాశు ని
ర్వాకమాచిరం చిరమ్
ప్రాకటీకృతార్థయే
మూకవాగ్విలాస దీ
నం కరోమివందనమ్
77)
శ్రీ వికారి చైత్ర శుద్ధ త్రయోదశి,
17-4-2019, బుధవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము : *మదరేఖ* (మసగ)
ప్రాస √. యతి ×
స్వామీ! నేడవధాన
మ్మే మాన్యమ్ముగ సాగన్
ప్రామాణ్యమ్మగు నిన్నే
సామాన్యుణ్ణిలఁగొల్తున్
78)
శ్రీ వికారి చైత్ర శుద్ధ చతుర్దశి,
18-4-2019, గురువారము.
ప్రార్థనా ---🔔
ఛందము: *తనుమధ్య* (తయ)
ప్రాస √. యతి ×
వందే గణనాథా
సందేహములన్నీ
యిందే తొలగంగా
నందమ్మవధానం
79)
శ్రీ వికారి చైత్ర శుద్ధ పౌర్ణమి,
19-4-2019, శుక్రవారము.
ప్రార్థనా ---🔔
ఛందము: *ప్రభాకలిత* నజజభరసవ
ప్రాస √. యతి 1-13
అడుగులువేయుటలోన పృచ్ఛకులందరిన్ సరిజేయగా
నుడుగులఁగూర్చుటయందు బాల వినోదకేళి ముదంబుగా
వడివడిఁదీర్చుము పార్వతీముఖ భాసుర ప్రకటాననా
బుడుతవధానముఁసేయఁబూనెను పోవడిన్ సరిజేయుమా
80)
శ్రీ వికారి చైత్ర బహుళ పాడ్యమి
20-4-2019, శనివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *వితాన* (జమగగ)
ప్రాస √. యతి ×
సుధాస్యబింబాతుండాత్మన్
ప్రధాన పూజ్యానందమ్మున్ |
వధాన సాహిత్యౌపమ్యే
విధేహి విఘ్నేశ ప్రాద్యా ||
81)
శ్రీ వికారి చైత్ర శుద్ధ ద్వితీయ,
21-4-2019, ఆదివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *మధురగతి* (భభభనల)
ప్రాస √. యతి 1-7.
మాయిక వాచిక మౌనవదన గణ
కాయిక కార్మిక గండ కథన హర |
దాయక హృద్యవధాన జయకరద
పూయగణాధిప! బుద్ధులనొసగుము ||
82)
శ్రీ వికారి చైత్ర బహుళ తృతీయ,
22-4-2019, సోమవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *చంద్రశ్రీ* (యమనసరగ)
ప్రాస √. యతి 1-12.
నమోవిఘ్నధ్వాంత ప్రకటిత వినాశాకరా ని
త్య మార్దన్యోన్యాభిః ప్రసరిత సుధామూలరూపా |
సమానీతా సంకష్టహర గణ చైతన్య మూర్తీ
సమాధానాధానే సమధిక విచారం ప్రభో! దీ ||
83)
శ్రీ వికారి చైత్ర బహుళ చతుర్థి,
23-4-2019, మంగళవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *హంసమాల* (సరగ)
ప్రాస √. యతి ×
వరమౌళీ గజాస్యా
దరవిఘ్నాంతక శ్రీ |
కర హృద్యావధానే
స్మరణీయ ప్రణామః ||
84)
శ్రీ వికారి చైత్ర బహుళ పంచమి,
24-4-2019, బుధవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *చంపకకేసరి* సజసససవ
ప్రాస √. యతి 1-9.
జననీ! వరాప్తగుణ జన్య సుతాకలితామృతా
ప్రణవాద్ద్విరేఫ నద రంజిత గానకళాధరా! |
మనుమావధాన పథమాద్య కవిత్వ విధాతవై
ప్రణతుల్ గణేశ గణభావన సంస్కృతినీయుమా!
85)
శ్రీ వికారి చైత్ర బహుళ షష్ఠి,
25-4-2019, గురువారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *సుకేసరము* నజభజర
ప్రాస √. యతి 1-11.
ప్రమథ గణాధిపాదర శుభంకరాద్య పూ
జ్య మధుకరాక్షరరేప్సిత విచారపూర్ణద |
భ్రమరవదేవ మోదకర లక్షణ పద్య రూ
పమునవధానమందున విభాసిలన్నతుల్
86)
శ్రీ వికారి చైత్ర బహుళ సప్తమి,
26-4-2019, శుక్రవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *ప్రియంవద* నభజర
ప్రాస √. యతి 1-8.
జయ గణేశ వరశాస్త్ర సారదా
భయకరా సుముఖ వాంఛితప్రద |
ప్రియసుతా శివకరీ శివాస్య వి
స్మయ వధాన వరమాశు దేహిమే ||
87)
శ్రీ వికారి చైత్ర బహుళ అష్టమి,
27-4-2019, శనివారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *నరకపుష్పిణి* నసయయవ
ప్రాస √. యతి 1-9.
గజముఖ సుధీమ శంకావినాశప్రభో
అజగముఖ ధీప్రధానాజ్ఞవిద్యోతన |
త్రిజగ తురగోత్తమాధీనయాఖు స్వవా
హజ గణపతే వధానాశు మోక్షప్రదా ||
88)
శ్రీ వికారి చైత్ర బహుళ నవమి,
28-4-3019, ఆదివారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *విచిత్ర* యయ
ప్రాస √. యతి ×
కరీంద్రాస్య లంబో
దర! ప్రాద్య పూజ్య |
స్మరాష్టావధానా
క్షరాక్ష! ప్రణామః ||
89)
శ్రీ వికారి చైత్ర బహుళ దశమి,
29-4-2019, సోమవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *మంజుభాషిణి* సజసజగ
ప్రాస √. యతి √
జయహే! గణాధిప! విశాల వాఙ్నిధీ!
స్మయ గీర్వచోభిరభిమాన ధీప్రదా |
క్షయ సావధాన వరగంగ దేహి మే
నయ కోవిదాగ్రణి సనాతనాక్షతా ||
90)
శ్రీ వికారి చైత్ర బహుళ ఏకాదశీ,
(30-4-2019), మంగళవారమ్.
ప్రార్థనా --- 🔔
ఛందమ్: *నళిని* ససససస
ప్రాస √. యతి. 1-10.
గణపా మధుపాస్య సమాంగ శుభాకర ల
క్షణ రక్షణ శిక్షణశాస్త్ర సుధీ వర భీ
షణ విఘ్న విధిఘ్న కళా చతురాన్వయ మే
ప్రణతాప్త వధాన విధౌ రసవత్కురు భో!
91)
శ్రీ గణేశ శారదాగురుభ్యోనః
శ్రీ వికారి చైత్ర బహుళ ద్వాదశి
1-5-2019, బుధవారం
ప్రార్ధనా---🔔
ఛందము..వ్రీడ
గణములు: యగ
యతి లేదు
ప్రాస..ఉంది
నమస్తే వి
భ్రమాంతావి
ఘ్నమాన్యాస
ద్యుమాపుత్రా
92) శ్రీ వికారి చైత్ర బహుళ త్రయోదశి, గురువారము.
తేది 02-05-2109
ఛందము: *సుముఖీ*(నజజవ)
ప్రాస √. యతి 1-7
గజవర దాస్య గణైకవిభో
భజగుణ శీలవధానగతిః
నిజముఖ పర్వణి దేహిజయమ్
ప్రజవరణీ యభవాజ్యనతుల్
93 వ రోజు
శ్రీ వికారి చైత్ర బహుళ చతుర్దశి,
3-4-2019, శుక్రవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *హంసమాల* సరగ
ప్రాస √. యతి ×
జయహే శ్రీగణాధీ
శ! యుగాస్యాత్మవిద్యా |
ప్రయతే ధాన పద్యా
క్షయ! వందామహే ధీ!
94వ రోజు
శ్రీ వికారి చైత్ర బహుళ అమావాస్య,
4-5-2019, శనివారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము: *శిఖరిణి* యమనసభవ
ప్రాస √. యతి 1-13
ప్రభుస్త్వం విఘ్నానాం ప్రణత జన సద్భావగుణినామ్
విభుస్త్వం సిద్ధీ ఋద్ధి సతి యుగళావిష్కృత పతిః |
స్వభావావైలక్షణ్యనుపమ దయాలాస్య కలితః
సభాయాం సంధానే హృదయపద వాసాష్ట వినతుల్
95వ రోజు
శ్రీ వికారి వైశాఖ శుద్ధ పాడ్యమి
05-05-2019,ఆదివారము
ప్రార్థనా --- 🔔
ఛందము: *సుమంగళి* సజససగ
ప్రాస √ యతి 1-8.
జయమంగళప్రద శమాది విధాతా
స్మయకోవిదాగ్రణి మహా కరుణాళూ! |
నియతావధాన జనితాశు కవిత్వా
భయదాయకా ప్రణవ తుండ! నమస్తే ||
96వ రోజు
శ్రీ వికారి వైశాఖ శుద్ధ ద్వితీయ,
6-5-2019, సోమవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *కార్తీక* నజజజభరవ
ప్రాస √. యతి 1-11
నియమిత కాలపరీవృత నిత్య విఘ్నవినాశక ప్రభో
జయకరుణావరుణాలయ శంకరాప్త గజాస్య సద్విభో |
నయగుణమేహి వధాన వినాయకస్త్వముపాస్మహే శుభో
దయకర కోటిరవిప్రభ ధన్య పద్య సుధాకరా నమః ||
97వ రోజు
శ్రీ వికారి వైశాఖ శుద్ధ తదియ,
7-5-2019, మంగళవారము.
ప్రార్థనా ---- 🔔
ఛందము; *పుష్పిణి* నసమయవ
ప్రాస √. యతి 1-9
అనునయము నీ భావాహారమే విఘ్నరాట్
జనిత సుగుణమ్మై నైజప్రకాశమ్మయెన్
వినుత యవధానాద్యా విజ్ఞ మూర్తి ప్రభో
స్వనిజ కరుణా సాంద్రప్రాభవా సన్నుతుల్
98) శ్రీ వికారి వైశాఖ శుద్ధ చతుర్థి,
8-5-2019, బుధవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *మృగీ* ర-గణము
ప్రాస √. యతి ×
విఘ్నపా
విఘ్నదా |
నిఘ్న ర
క్షౌఘ్న నౌ ||
99) శ్రీ వికారి వైశాఖ శుద్ధ పంచమి,
9-5-2019, గురువారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: *ప్రగుణ* సగగ
ప్రాస √. యతి ×
కవితా స్వాధ్యా
యవధానే నౌ
మి వరప్రాద్యా
స్తవ విఘ్నాంతా ||
100)
శ్రీ వికారి వైశాఖ శుద్ధ షష్ఠి,
10-5-2019, శుక్రవారము.
ప్రార్థనా --- 🔔
ఛందము: మంగళమహాశ్రీ: భజసన భజసన గగ
ప్రాస √. యతి 1-9-17
వందనము విఘ్నపతి వందనము వాక్సుదతి వందనము పార్వతిమహేశున్
వందనము తాతలకు వందనము సద్గురుకు వందనములాప్త తలిదండ్రిన్
వందనము విప్రులకు వందనము విజ్ఞులకు వందనము పృచ్ఛకులకెల్లన్
వందనము ధారణకు వందనము ధోరణికి వందనము ధారధిషణాలన్
###స్వస్తి ###
బాలముకుందశర్మతన*
ReplyDeleteప్రజ్ఞవిశేషపుసూచిగానిటన్!
లీలగవిఘ్ననాయకుని*
లోచనయోచనయందువేడుచున్!
కాలిడెనావధానమున*
జ్ఞానప్రసూనకృపాకటాక్షమున్!
మేదిని వందపద్యములు*
మేలిమివజ్రపుటాణిముత్యముల్!
మాముశ
మిత్రమా... మీ ఛందో, వ్యాకరణాది ప్రజ్ఞకు ఆశ్చర్యపోతున్నాను.
ReplyDeleteఆర్యా మీ యీలఘుకృతిని ఇప్పుడే చూసాను. చక్కగా ఉంది.
ReplyDelete